పరిచయం – Kingdom Animalia – ఏనిమేలియా
Table of Contents
వెన్నెముక లేని జంతువులను అకశేరుకాలు అంటారు. జంతుప్రపంచంలో అత్యధిక జీవులు వెన్నుముకలేని జీవులే. ఈ సమూహంలోని జంతువులు వివిధ పరిమాణాలలో నిర్మాణాత్మకమైన వైవిధ్యంతో రకరకాల అనుకూలనాలను కలిగి ఉండి వివిధ ఆవాసాలలో నివసిస్తాయి.
జంతువు (Animal) అనే పదం ఏనిమేలియా అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. (శ్వాస కలిగి ఉండటం అని అర్థం) ఈ జంతు సమూహంలోని జీవుల యొక్క వర్గీకరణ రాజ్యం ఏనిమేలియా కిందకు వస్తుంది. ఈ ఏనిమేలియా రాజ్యంలోని జీవులన్నీ బహుకణ జీవులే. అందువల్ల వీటిని మెటాజోవన్లు అని అంటారు. ఇవి పరపోషకాలైన నిజ కేంద్రకం కలిగిన బహుకణ జీవులు. ఈ జీవులన్నీ అనేక కణాలను కలిగి ఉంటాయి. కాని కణం చుట్టూ కణకవచం ఉండదు. వీటిలో పోషణ జాంతవ భక్షణ పద్ధతిలో జరుగుతుంది. వీటిలో కొన్ని పరాన్నజీవులు కూడా ఉన్నాయి. వీటిలో ఆహార అంతర్గ్రహణం ద్వారా శరీర అంతర కుహరంలో జరుగుతుంది. అదనపు ఆహారం సాధారణంగా గ్లైకోజన్ రూపంలో నిల్వ చేసి ఉంటుంది. వీటిలో చాలా జీవులు చలించే శక్తి కలిగి ఆహార సేకరణ కోసం ఆహారసేకరణ చలనాన్ని జరుపుతాయి. కండర కణాలు, నాడీ కణాలుంటాయి. ప్రత్యత్పత్తి ముఖ్యంగా లైంగిక విధానం ద్వారా జరుగుతుంది. కొన్ని రకాల జీవులలో అలైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరుగుతుంది. వీటిలో పిండాభివృద్ధి కూడా జరుగుతుంది.
శరీర సౌష్టవం (Body symmetry) – Kingdom Animalia
జంతు అధ్యయనంలో సౌష్టవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. జీవులన్నీ భిన్నమైన నిర్మాణాలతో ఉన్నప్పటికి కొన్ని సాధారణ సౌష్టవాలతో మాత్రమే ఉంటాయని క్యువియర్ (Cuvier) పేర్కొన్నారు. సౌష్టవాన్ని గురించిన ప్రస్తుత అవగాహన’ హెకెల్ (Haeckel) అనే శాస్త్రవేత్త భావాలను పరిగణలోనికి తీసుకొన్నారు.
చాలా జంతు సమూహాలలోని దేహ భాగాల అమరిక (Arrangement of body parts) జ్వామితీయ కల్పన (geometrical design) పద్ధతిలో ఉన్నప్పుడు లేదా కేంద్రీకృత అక్షాలు, తలాలకు (Centralized axes and planes) అనుబంధంగా ఉన్నప్పుడు దాన్ని “సౌష్టవం” అని పేర్కొంటారు. సౌష్టవ లేదా సౌష్టవ రహిత జీవులను ఒక తలం ద్వారా లేక అనేక తలాల ద్వారా ఖండించినపుడు దర్పణ ప్రతిబింబ (mirror images) అర్ధభాగాలు ఏర్పడతాయి. వీటి జ్యామితీయ కల్పన ఒకే రీతిలో ఉంటుంది. ఇలాంటి అర్ధ భాగాలను “యాంటిమియర్లు” (Antimeres) అంటారు. జంతువుల్లో శరీర సౌష్టవం ఉన్నా అది సంపూర్ణంగా ఉండదు. ఒకవేళ సంపూర్ణ సౌష్టవం అంటూ ఉంటే అది ప్రాథమిక పిండదశలోనే ఉంటుంది. అభివృద్ధి చెందే కొద్దీ అవయవాల శరీర సౌష్టవంలో మార్పు వస్తుంది. ఆ విధంగా జంతువుల పిండదశలో ఒక సౌష్టవాన్ని, ప్రౌఢ దశలో మరొక సౌష్ఠవాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి సౌష్టవ నిర్ధారణకు ప్రౌఢ దశలోని సౌష్టవాన్ని లేదా సౌష్టవ రాహిత్యాన్ని బట్టి కాకుండా పిండదశలోని సౌష్టవాన్నే ఆధారంగా తీసుకొంటారు. ఉదా: నత్తలు, సముద్ర నక్షత్రాలు.
శరీర త్వచం (Body wall) – Kingdom Animalia
జంతువులలో శరీర త్వచం రెండు లేదా మూడు పిండ పొరలతో నిర్మితమై ఉండవచ్చు. అటువంటి జంతువులను ద్విస్తరిత లేదా త్రిస్తరిత జీవులని పేర్కొంటారు. ద్విస్తరిత జీవులలో శరీర త్వచంలో బాహ్యంగా బాహ్యచర్మం, అంతర్గతంగా లోపలి అంతరచర్మాన్ని కలిగి ఉండి ఈ రెండు పొరల మధ్య మీసోగ్లియా ఉంటుంది. త్రిస్తరిత జీవులలో శరీరంలో బాహ్యంగా బాహ్యచర్మం, లోపల అంతరచర్మం ఈ రెండింటికి మధ్య మీసోడర్మ్ (మధ్యస్తరం) ఉంటుంది. ఉదా: సీలెంటిరేట్లు, ప్లాటిహెల్మింథిస్లు, కార్డేట్ జీవులు.
శరీర కుహరం (Coelom): Kingdom Animalia
శరీర కుహరం అంటే జీవుల దేహంలో ఉండే కుహరం అని అర్థం. జంతువులలో శరీర కుహరం వివిధ రకాలుగా ఏర్పడి ఉంటుంది లేదా అసలు పూర్తిగా లోపించి ఉంటుంది. జంతు వర్గీకరణలో తోడ్పడే ప్రధాన లక్షణాలలో ఇది ఒకటి. జీవుల దేహ పరిమాణాన్ని పెంచడంతో పాటు వాటి నిర్మాణానికి శరీర కుహర ప్రాధాన్యత ఉంది. శరీరకుహరం శరీరకుహర ద్రవంతో నిండి ఉండి జలాస్థి పంజరం (Hydraulic skeleton) గాను, ప్రసరణ మాధ్యమంగాను పని చేస్తుంది.
ఎ) శరీరకుహర రహిత జీవులు (Acoelomates) – ఈ జీవులలో శరీర కుడ్యం ఆహారనాళాల మధ్య ఎటువంటి కుహరం లేకుండా, మధ్యస్త్వచం నుంచి ఏర్పడే కండర తంతువులు, మీ సెన్కోమా, పేరంకైమా లేదా మధ్య భ్రూణ కణజాలంతో (Mesenchyma (or) Parenchyma) నిండి ఉన్నప్పుడు దాన్ని ‘శరీరకుహర రహితం’ అంటారు. ఇటువంటి జీవులను ‘శరీరకుహర రహిత’ జీవులు అంటారు. ఉదా: ప్లాటీహెల్మింథిస్ వర్గ జీవులు.
మిథ్యా శరీరకుహరం (Pseudocoelomates) – పిండాభివృద్ధి సమయంలో ఏర్పడిన విదళన కుహరం లేదా బ్లాస్టోసీల్ (Segmentation cavity (or) Blastocoel) అదృశ్యమై
పోకుండా ప్రౌఢజీవుల శరీరకుడ్యం ఆహారనాళాల మధ్య విశాలమైన కుహరంగా ఉండిపోయినప్పుడు దాన్ని ‘మిథ్యా శరీరకుహరమని’ అంటారు. నిజ శరీర కుహరం లాగా మధ్య త్వచం, అంతఃచర్మం నుంచి ఏర్పడదు. కాబట్టి దీనికి మిథ్యా శరీర కుహరం అనే పేరు వచ్చింది.
ఉదా : ఆస్క్హెల్మింథిస్
సి) నిజ శరీరకుహరం (లేదా) శరీర కుహరం (Eucoelomates) : మధ్యస్త్వచం నుంచి (Mesoderm) ఉద్భవించి ఆహారనాళం, శరీరకుడ్యాల మధ్య విస్తరించి మధ్యస్త్వచ నిర్మితమైన ఆంత్రవేష్టనంతో (Peritoneal layer) ఆవరించి ఉండే కుహరాన్ని ‘శరీరకుహరం’ అంటారు. దీనికి నిజ శరీరకుహరం లేదా ద్వితీయ కుహరం (True body cavity (or) Secondary body cavity) అనే పేర్లు కూడా ఉన్నాయి.
ఉదా: అనెలిడా వర్గం నుంచి సకశేరుకాల వరకు
ఖండీభవనం (Segmentation): – Kingdom Animalia
దీనినే మెటామెరిజమ్ అని కూడా పిలుస్తారు. ఈ జీవులలో ఒక వరుసలో వృత్తాకారపు ఉంగరాల వంటి నిర్మాణాలుంటాయి. వాటిని ‘దేహ ఖండాలు’ (Metameres) అంటారు. ఈ దేహఖండాలు శరీర ఉపరితల భాగం నుంచి లోపలి అంతర్భాగాలకు విస్తరించి వర్తులాకారంగా ఉండి రెండు ఖండితాల మధ్య ఖండితాంతర గాదులుగా ఉంటాయి. ఈ గాడులు శరీర కుహరంలోనికి వ్యాపించి ‘విభాజకాలు’ (Septa) అనే అడ్డుగోడలుంటాయి. ప్రతి ఖండితంలో ముఖ్య భాగమైన అవయవ వ్యవస్థలన్నీ ఉంటాయి. ఈ విధంగా ఒకే రకంగా ఉండే ఖండితాలుగా విభజితమవడాన్ని సమవిభక్త సమఖండ విన్యాసం అని పిలుస్తారు.
ఉదా: వానపాము, అనెలిడా వర్గజీవులు.
పృష్ఠవంశం (Notochord):
ప్రాథమిక సకశేరుక జీవులలో పృష్ఠవంశం మధ్య త్వచం నుంచి ఏర్పడి సన్నని కడ్డీలాగా ఉండి శరీరానికి ఆధారాన్నిస్తుంది. ఇది పిండ దశలలో కాని, కొన్ని జీవులలో ప్రౌఢ దశలలోకాని ఉంటుంది. పృష్ఠవంశం కలిగి ఉన్న జీవులను సాధారణంగా కార్డేటా జీవులంటారు. ఉదా: వెన్నముక గల జీవులు. పృష్ఠవంశం లేని జీవులను నాన్కార్డేటా (అకశేరుకాలు) అని అంటారు.
ఉదా: పొరిఫెరా జీవులు నుంచి హెమికార్డేటా జీవుల వరకు.
1.2 జంతువుల వర్గీకరణ (Classification of Animals) – Kingdom Animalia
జంతువుల వర్గీకరణం భేదాభిప్రాయాలతో కూడుకొని ఉంది. వివిధ శాస్త్రవేత్తలు వేర్వేరు వర్గీకరణాల్ని ప్రకటించారు. ఇది ఆయా జీవుల ప్రమాణం మరియు లక్షణాలను బట్టి ఆధారపడి ఉంటుంది. మొత్తం జంతు సామ్రాజ్యాన్ని 30 వర్గాలుగాను, మరియు 68 విభాగాలుగా విభజించారు. ఈ విభాగాలు తిరిగి 350 క్రమాలుగా విభజింపబడ్డాయి. హైమన్, బార్నర్ మరియు స్టోరర్ అనే శాస్త్రవేత్తల ప్రకారం ఈ వర్గీకరణ కొద్దిగా మార్పుచేయబడినది.
వర్గీకరణలో వివిధ అంతస్థులు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి రాజ్యం (Kingdom), వర్గం, విభాగం, క్రమం, కుటుంబం, ప్రజాతి, జాతి మధ్య కొన్ని మధ్యంతరస్థాయిలు ఉండవచ్చు. అవి ఉపరాజ్యం (Subkingdom), ఉపవర్గం, అధి విభాగం, ఉప విభాగం, అధిక్రమం, ఉపక్రమం, అధి కుటుంబం, ఉప కుటుంబం, ఉపజాతి మొదలయినవి.
జీవరాశులను వివిధ రాజ్యాలుగా విభజించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వివిధ వర్గీకరణ శాస్త్రవేత్తలు రెండు రాజ్యాల వర్గీకరణ, మూడురాజ్యాల వర్గీకరణ, ఐదు రాజ్యాల వర్గీకరణలను ప్రతిపాదించారు. జంతువర్గీకరణ కింద వివరించడం జరిగింది.
రాజ్యం – ఏనిమేలియా
రాజ్యం ఏనిమేలియా అనేక జంతువులతో కూడికొని ఉన్న పెద్ద సమూహం. ఇది ప్రపంచంలో జంతు సమూహాలను ఎక్కువగా ఆక్రమించి ఉంది. ఇది రెండు ఉపరాజ్యాలుగా విభజింపబడినది. (1) ప్రోటోజోవా (2) మెటాజోవా.
ఉపరాజ్యం : ప్రోటోజోవా
ఈ ఉప రాజ్యంలో దాదాపు 50,000 జాతుల జీవులను గుర్తించారు. ఈ జీవులన్నీ లేదా హిత మరియు సూక్ష్మదర్శినిలో మాత్రమే చూడగల జంతువులు. ఇవి సాధారణంగా ఏకాంత లేదా సమూహంగా గాని నివసిస్తాయి. ఇవి ప్రత్యేకమైన కణాంగాలను కలిగి ఒక కేంద్రకం నుంచి అనేక కేంద్రకాలను కలిగి ఉంటాయి. వీటిలో పోషణ జాంతవ భక్షణ పద్ధతిలోగాని, పాదపీయ భక్షణ పద్ధతిలోగాని లేదా పూతికాహార పద్ధతిలోగాని లేదా పరాన్నజీవన పద్ధతిలో గాని జరుగుతుంది. ఈ జీవులన్నీ మంచినీటిలో గాని లేదా సముద్ర నీటిలోగాని లేదా తేమగల ప్రదేశాలలో జీవిస్తాయి.
ఉదా: యూగ్లినా, ట్రిపనోసోమా, అమీబా, పేరామీషియం, మోనోసిస్టిస్, ఎల్ఫీడియం మొదలయినవి.
